- 400 మీటర్ల పరుగులో రజతం.. 100 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్యం
హుస్నాబాద్, అక్టోబర్ 28 (చైతన్యగళం):
హుస్నాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థులు క్రీడా రంగంలో ప్రతిభ చాటారు. సిద్దిపేట జిల్లా స్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్) పోటీల్లో పతకాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
400 మీటర్ల పరుగు పందెంలో ఓ. విగ్నేష్ రజత పతకం సాధించగా, 100 మీటర్ల హర్డిల్స్ పోటీలో విష్ణు వర్ధన్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
విద్యార్థులు సాధించిన విజయాలపై ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల కృషి, పట్టుదల, క్రీడాస్ఫూర్తిని అభినందించారు. విద్యతోపాటు క్రీడలు కూడా విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి, వారికి తగిన వేదిక, మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందించడమే ఆల్ఫోర్స్ విద్యాసంస్థల లక్ష్యమని తెలిపారు.
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విగ్నేష్, విష్ణు వర్ధన్ సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకొని ఇతర విద్యార్థులు కూడా పట్టుదలతో ముందుకు సాగి తమ ప్రతిభను నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, క్రీడా ఉపాధ్యాయులు అభినందించారు.
