- ధాన్యం కేటాయింపుల విధానంపై అధికారులు స్పష్టత ఇవ్వాలి: కవ్వ వేణుగోపాల్‌రెడ్డి
హుస్నాబాద్, నవంబర్ 14 (చైతన్యగళం):
హుస్నాబాద్ నియోజకవర్గ రైతులు పండించిన ధాన్యాన్ని స్థానిక రైస్ మిల్లులు, బాయిలర్ మిల్లులకే కేటాయించాలని భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ ఇన్‌చార్జి కవ్వ వేణుగోపాల్‌రెడ్డి కోరారు. హుస్నాబాద్‌లో మిల్లులు అందుబాటులో ఉన్నప్పటికీ ధాన్యాన్ని సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలకు ఎందుకు కేటాయిస్తున్నారో జిల్లా అధికారులు స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించడం వల్ల రైతులకు రవాణా ఖర్చులు పెరగడంతోపాటు సమయం కూడా వృథా అవుతోందని తెలిపారు. హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, విశ్రాంతి షెడ్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ధాన్యంలో తేమ శాతం పేరుతో తరుగు తీస్తున్నారనే రైతుల ఫిర్యాదులపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమస్యలను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్, పౌరసరఫరాల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని రైస్ మిల్లులు, బాయిలర్ మిల్లులకు ధాన్యం కేటాయింపులపై అమలవుతున్న విధానాన్ని రైతులకు స్పష్టంగా వివరించాలని విజ్ఞప్తి చేశారు.
రైతులపై ఎలాంటి అదనపు రవాణా భారం పడకుండా స్థానికంగానే ధాన్యం సేకరణ, కేటాయింపులు జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కవ్వ వేణుగోపాల్‌రెడ్డి కోరారు.

