- విద్యార్థినులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి.. ప్రాథమిక ఆంగ్లంలో మాట్లాడేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
ఎల్కతుర్తి, నవంబర్ 17 (చైతన్యగళం):
హనుమకొండ జిల్లా, హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినుల సంఖ్య, ఉపాధ్యాయుల హాజరు తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు ప్రతి ఒక్కరూ ప్రాథమిక ఆంగ్లంలో మాట్లాడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ఇంటర్మీడియట్ విద్యార్థినులతో మంత్రి నేరుగా మాట్లాడి ప్రతిరోజూ నాణ్యమైన భోజనం, అల్పాహారం అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది మెస్ ఛార్జీలు, సౌందర్య సాధనాల ఛార్జీలు పెంచిన తర్వాత నాణ్యమైన భోజనంతోపాటు అన్ని రకాల సౌకర్యాలు అందుతున్నాయని విద్యార్థినులు మంత్రికి తెలిపారు.
గత విద్యా సంవత్సరంలో విద్యార్థినులు సాధించిన మార్కుల వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి, ప్రతి ఒక్కరూ బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. చదువుతోపాటు క్రీడలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ముందుండాలని అన్నారు. క్రీడల్లో ఇప్పటికే ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను అభినందిస్తూ, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి పాఠశాలకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
విద్యార్థినులు కష్టపడి చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, వారు సాధించే విజయాలు కుటుంబానికి, తల్లిదండ్రులకు, గ్రామానికి గౌరవం తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తోందని తెలిపారు.

