- చెరువు భూమిని కాపాడాలి.. రెవెన్యూ అధికారులకు గ్రామస్తుల ఫిర్యాదు
ఎల్కతుర్తి, అక్టోబర్ 28 (చైతన్యగళం):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ఊర చెరువు శివారు భూమి ఆక్రమణకు గురవుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు భూమిని పరిరక్షించాలని, ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను కోరారు.
తిమ్మాపూర్ శివారులో సుమారు 55 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఊర చెరువు కింద దాదాపు 250 ఎకరాల సాగుభూమి ఉందని గ్రామస్తులు తెలిపారు. ఈ చెరువు నీటిపైనే గ్రామంలోని పలువురు రైతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి చెరువు శివారు భూమిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.
గుంటూరుపల్లె గ్రామ పంచాయతీ పాలకవర్గం చెరువు శివారు భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని తిమ్మాపూర్ గ్రామస్తులు ఆరోపించారు. తొలుత అక్కడ పోచమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించి, అనంతరం బోరు వేశారని పేర్కొన్నారు. ఇటీవల దసరా పండుగకు నాలుగు రోజుల ముందు చెరువు శివారులోని సుమారు రెండు ఎకరాల స్థలాన్ని చదును చేసి, మొరం పోసి ఆక్రమణకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై తిమ్మాపూర్ సర్పంచ్ ముప్పు మానస మహేందర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నేపథ్యంలో బుధవారం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సదానందం, జీపీ కృష్ణ గ్రామానికి చేరుకుని వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు తమకు ఇప్పటికే నీటి ఎద్దడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ చెరువును కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటే గుంటూరుపల్లెకు చెందిన కొందరు వచ్చి బోర్లు వేసి నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు చెరువు శివారు భూమిపైనా ఆక్రమణ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రెవెన్యూ అధికారులు స్థలంపై సమగ్ర విచారణ జరిపి, చెరువు భూమి హద్దులను నిర్ధారించాలని గ్రామస్తులు కోరారు. చెరువు శివారు భూమికి రక్షణ కల్పించి, భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
