- విద్యార్థులు బాగా చదివి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలి: కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్
కరీంనగర్, అక్టోబర్ 28 (చైతన్యగళం):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ముఖ్యమంత్రి అల్పాహార కార్యక్రమాన్ని కరీంనగర్‌లోని సుభాష్‌నగర్ హనుమాన్ రోడ్డులో ఉన్న ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో 26వ డివిజన్ కార్పొరేటర్, కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ ప్రారంభించారు. హరే రామ హరే కృష్ణ స్వచ్ఛంద సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించనున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి అంజన్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారు ఆరోగ్యంగా ఉంటూ చదువుపై మరింత శ్రద్ధ చూపేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
విద్యార్థినీ విద్యార్థులు కష్టపడి చదివి మంచి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, భవిష్యత్తులో రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీలక్ష్ తదితరులు పాల్గొన్నారు.
