- ఇందిరమ్మ కుటుంబ బీమా, చీరల పంపిణీ ప్రారంభోత్సవానికి మహిళలు భారీగా తరలిరావాలి: పాతూరి వెంకటస్వామి గౌడ్
దుబ్బాక, నవంబర్ 17 (చైతన్యగళం):
సిద్దిపేటలో రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి వెంకటస్వామి గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సభలో ప్రతిష్ఠాత్మక ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించడంతోపాటు, రెండో విడత ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలు, మహిళలు, రైతులు, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ పలు పథకాలను అమలు చేస్తోందని పాతూరి వెంకటస్వామి గౌడ్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నాయని అన్నారు.
దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని పాతూరి వెంకటస్వామి గౌడ్ విజ్ఞప్తి చేశారు.

