- మల్లన్నసాగర్ భూ బాధితులను ఆదుకోవాలి.. చేనేత, పద్మశాలి కార్మికుల కోసం ప్రత్యేక పథకం ఏర్పాటు చేయాలి
దుబ్బాక, నవంబర్ 17 (చైతన్యగళం):
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన సందర్భంగా సిద్దిపేటతోపాటు దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి రూ.350 కోట్లు కేటాయించాలని బహుజన లిబరల్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) చైర్మన్ శ్రీరాం రామకృష్ణ ప్రభు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు. దుబ్బాకలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జీఎస్పీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మాచవరం వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు.
తెలంగాణలో దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని, రాజకీయ నాయకులు స్వార్థ రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప నియోజకవర్గ అభివృద్ధిపై తగిన శ్రద్ధ చూపడం లేదని శ్రీరాం రామకృష్ణ ప్రభు విమర్శించారు. దుబ్బాక చేనేత కళలకు ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొంటూ, నియోజకవర్గ పరిధిలోని చేనేత, పద్మశాలి కుటుంబాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ఏర్పాటు చేసి రూ.50 కోట్లు కేటాయించాలని కోరారు.
దుబ్బాక మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం రూ.80 కోట్లు కేటాయించాలని, నూతనంగా ఏర్పాటైన భూంపల్లి–అక్బర్‌పేట, రాయపోల్, నార్సింగి మండలాల అభివృద్ధికి గ్రామ పంచాయతీల వారీగా రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.65 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మిరుదొడ్డి, చేగుంట మండలాలకు ఒక్కో మండలానికి రూ.10 కోట్ల చొప్పున మొత్తం రూ.20 కోట్లు కేటాయించాలని కోరారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల అభివృద్ధికి అధికారులు సమగ్ర ప్రణాళికలు రూపొందించి అవసరమైన నిధులు మంజూరు చేయాలని సూచించారు.
మల్లన్నసాగర్ నిర్మాణం కారణంగా భూములు, గ్రామాలను కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న భూ బాధితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదుకోవాలని ఆయన కోరారు. బాధితులకు తగిన పరిహారం అందించడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించి వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు సాగునీరు, నిరంతర విద్యుత్, గిట్టుబాటు ధర వంటి సదుపాయాలు కల్పించడంతోపాటు దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సాన తిరుపతి, గుండా శ్రీనివాస్, మల్లేశం, వెంకటేశం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

