- సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. అధికారులకు పలు సూచనలు
సిద్దిపేట, నవంబర్ 17 (చైతన్యగళం):
ఈ నెల 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. సిద్దిపేట బైపాస్ రోడ్డులోని నాగదేవత ఆలయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని సందర్శించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సభకు భారీ సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సభకు వచ్చే వాహనాల పార్కింగ్, బారికేడింగ్, లైటింగ్, భద్రత, జన సమీకరణ, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలపై పలు సూచనలు చేశారు. సభా వేదిక నిర్మాణంతో పాటు మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఈ నెల 19న సిద్దిపేట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు. దేశంలోనే తొలిసారిగా, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అదే రోజు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు.
ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత మూడేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు, భవిష్యత్తులో ప్రజల కోసం చేపట్టనున్న కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి సభా వేదికగా ప్రసంగించనున్నారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంగా నిర్వహించనున్న ఈ సభకు సిద్దిపేటతో పాటు గజ్వేల్, దుబ్బాక, జనగామ, హుస్నాబాద్, మానకొండూర్, సిరిసిల్ల, వేములవాడ, నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాలు, పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న ఈ బహిరంగ సభకు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు ఆంక్ష రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హన్మంతరావు, పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

