Friday, October 2, 2026
Homeతెలంగాణకరీంనగర్ప్రముఖ వ్యాపారవేత్త గౌరిశెట్టి తిరుపతి కన్నుమూత

ప్రముఖ వ్యాపారవేత్త గౌరిశెట్టి తిరుపతి కన్నుమూత

📰 Generate e-Paper Clip

కరీంనగర్, అక్టోబర్ 1 (చైతన్యగళం):

ప్రముఖ వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, సేవా దృక్పథం కలిగిన గౌరిశెట్టి తిరుపతి (86) గురువారం సాయంత్రం పరమపదించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాపార, పారిశ్రామిక, సామాజిక, విద్యా, సేవా, ఆధ్యాత్మిక రంగాల్లో అనేక ప్రతిష్ఠాత్మక బాధ్యతలు నిర్వహిస్తూ విశేష సేవలందించారు.

గత 20 ఏళ్లకు పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ధర్మశాల నిర్వహణతో పాటు ప్రతిరోజూ 300 మందికి పైగా రోగులకు, వారి సహాయకులకు ఉచితంగా భోజనాలు అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని రోటరీ క్లబ్‌లకు డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా సేవలందించారు. గీత భక్త సమాజం, పొట్టి శ్రీరాములు ఫౌండేషన్, ఆవోపా సంస్థలకు కూడా సేవలందించారు.

కరీంనగర్ జిల్లా వైశ్య సంఘం మాజీ అధ్యక్షుడిగా, రోటరీ క్లబ్ మాజీ గవర్నర్‌గా, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, రాధాస్వామి ట్రస్ట్ అధ్యక్షుడిగా, గౌరిశెట్టి వెంకటయ్య మెమోరియల్ ట్రస్ట్ ఛైర్మన్‌గా, గౌరిశెట్టి వెంకటయ్య మెమోరియల్ కాలేజ్ మాజీ ఛైర్మన్‌గా, త్రిశక్తి ఆలయం డైరెక్టర్‌గా, వైశ్య సేవా కేంద్రం కౌన్సిలర్‌గా పలు బాధ్యతలు నిర్వహించారు.

అలాగే పాత బజార్, కరీంనగర్‌లో కౌన్సిలర్‌గా, ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడిగా, ఉస్మానియా లా కాలేజీ విద్యార్థి సంఘం మాజీ కార్యదర్శిగా సేవలందించారు.

ప్రముఖ వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా, ఆధ్యాత్మికవేత్తగా ఎదుగుతూ వివిధ సంస్థలకు నాయకత్వం వహించి సమాజ సేవలో తనదైన ముద్ర వేసిన గౌరిశెట్టి తిరుపతి సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఆయన మరణం కరీంనగర్ సమాజానికి, వైశ్య సమాజానికి, ఆయనను అభిమానించే వారికి తీరని లోటు. ఆయన అందించిన సేవలు, సమాజం పట్ల చూపిన అంకితభావం ఎల్లప్పుడూ స్మరణీయంగా నిలుస్తాయి.

ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ అపారమైన దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని పలువురు ప్రార్థిస్తున్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!