Friday, October 2, 2026
Homeతెలంగాణకరీంనగర్తుప్పు పట్టిన కూల్‌డ్రింక్ సీసాలు స్వాధీనం

తుప్పు పట్టిన కూల్‌డ్రింక్ సీసాలు స్వాధీనం

📰 Generate e-Paper Clip

కరీంనగర్, అక్టోబర్ 1 (చైతన్యగళం):

కరీంనగర్‌లోని ఓ రెస్టారెంట్‌లో నిర్వహించిన తనిఖీల్లో 200 మి.లీ. కూల్‌డ్రింక్ గాజు సీసాల మూతల వద్ద తుప్పు పట్టినట్లు ఆహార భద్రతా శాఖ అధికారులు గుర్తించారు. అదే ఉత్పత్తికి చెందిన ఇతర సీసాల్లోనూ ఇదే సమస్య కనిపించడంతో, సరఫరా చేస్తున్న పంపిణీ కేంద్రంలో తనిఖీలు చేపట్టారు. అక్కడ సుమారు 60 కేసుల 200 మి.లీ. గాజు సీసాల మూతల వద్ద తుప్పు ఉన్నట్లు గుర్తించి, నిబంధనల ప్రకారం మొత్తం 60 కేసుల నిల్వను స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం-2006 ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. సంబంధిత తయారీదారుకు వివరణ ఇవ్వాలని, తగిన సరిదిద్దే చర్యలు తీసుకోవాలని నోటీసు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

వినియోగదారులు, ఆహార వ్యాపార నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, ఆహార భద్రత లేదా ప్యాకేజింగ్‌కు సంబంధించిన అనుమానాస్పద సమస్యలను వెంటనే శాఖకు తెలియజేయాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా, ఆహార భద్రతా శాఖ అధికారులుగా నటిస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కొంతమంది వ్యక్తులు ఆహార భద్రతా శాఖ అధికారులు లేదా ఉద్యోగులమంటూ ఆహార వ్యాపార నిర్వాహకులు, ప్రభుత్వ వసతి గృహాల వార్డెన్లకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు శాఖకు సమాచారం అందింది. ఇటీవల తిమ్మాపూర్‌లోని ఓ ప్రభుత్వ వసతి గృహ వార్డెన్‌కు 7842521329 నంబర్ నుంచి ఇలాంటి మోసపూరిత కాల్ వచ్చినట్లు తెలిపారు.

అలాగే కొందరు వ్యక్తులు బేకరీలు, రెస్టారెంట్లు, ఇతర ఆహార వ్యాపార సంస్థలను సందర్శించి తాము ఆహార భద్రతా శాఖ ఉద్యోగులమని చెప్పుకుంటూ అనుమతి లేకుండా ప్రాంగణాల్లోకి ప్రవేశించడం, అనధికారికంగా ఫొటోలు తీయడం, డబ్బులు లేదా ఇతర ప్రయోజనాలను డిమాండ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా మోసపూరిత కాల్స్ ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!