- పట్టణ పరిశుభ్రతకు విశేష సేవలందించిన ఐదుగురికి పురస్కారం
హుస్నాబాద్, అక్టోబర్ 31 (చైతన్యగళం):
హుస్నాబాద్ పురపాలక సంఘ కార్యాలయంలో ఉమెన్స్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగం పరిధిలోని మహిళా సాధికారత కేంద్రం ప్రతినిధి పద్మ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తూ ఉత్తమ సేవలందించిన జవాన్ పైసా శ్రీకాంత్, సిబ్బంది ఆకారపు యాదమ్మ, ఆకారపు పద్మ, ముక్కెర శంకరయ్య, మంద సుధాకర్లను మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా దండి లక్ష్మి మాట్లాడుతూ.. పట్టణ పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని అన్నారు. ఎండ, వానలను లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న వారి కృషి అభినందనీయమని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి వారికి తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
