Friday, November 20, 2026
Homeతెలంగాణఅభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి!

అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి!

📰 Generate e-Paper Clip

  • హుస్నాబాద్ బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు
  • ప్రభుత్వ తీరుపై కౌన్సిలర్ గాదెపాక రవీందర్ విమర్శలు

హుస్నాబాద్, నవంబర్ 19 (చైతన్యగళం): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో హుస్నాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని కౌన్సిలర్ గాదెపాక రవీందర్ ఖండించారు. అరెస్టయిన నాయకులకు సంఘీభావం తెలిపేందుకు ఆయన పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అనంతరం మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధిపై అధికారులతో సమగ్రంగా వివరాలు సేకరించి ప్రజల ముందు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

గతంలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకే అభివృద్ధిని పరిమితం చేశారని విమర్శించిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు అదే ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తూ బీఆర్ఎస్‌ను ఓడిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని రవీందర్ వ్యాఖ్యానించారు.

ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, విద్యార్థినులకు స్కూటీలు, కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం, రైతులకు రూ.5 లక్షల బీమా వంటి హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు.

పింఛన్లు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నా అమలు చేయలేదని, అర్హులైన వృద్ధులు, చేనేత కార్మికులకు కొత్త పింఛన్లు మంజూరు చేయడం లేదని అన్నారు. పింఛన్ల పంపిణీ తేదీని కూడా 19వ తేదీ నుంచి 26వ తేదీకి వాయిదా వేశారని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టి, గతంలో ప్రారంభించిన పనులకే మళ్లీ ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఆరోపించారు. విమర్శలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, శంకుస్థాపన చేసిన పనులను పూర్తి చేసి రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని రవీందర్ ప్రభుత్వానికి సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!