రెండు బస్సుల మధ్య ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయిన నాగారం మహిళ
హుస్నాబాద్, నవంబర్ 20 (చైతన్యగలం):
సిద్దిపేటలో గురువారం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన కొమ్ము సారవ్వ (55) మృతి చెందింది. సభ ముగిసిన అనంతరం బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పక్క నుంచి వచ్చిన మరో బస్సుకు, ఆమె ఎక్కుతున్న బస్సుకు మధ్య ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయింది.
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే సారవ్వకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ మృతితో నాగారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సభకు వెళ్లి క్షేమంగా తిరిగి వస్తుందని ఎదురుచూసిన కుటుంబానికి ఈ ఘటన తీరని శోకాన్ని మిగిల్చింది.

