- గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో అక్టోబర్ 31న జరిగే వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం
కరీంనగర్, అక్టోబర్ 29 (చైతన్యగళం):
గుజరాత్ రాష్ట్రంలోని ఏక్తానగర్‌లో అక్టోబర్ 31న నిర్వహించనున్న రాష్ట్రీయ ఏక్తా దివస్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన తొమ్మిది మందిని జిల్లా యంత్రాంగం ఎంపిక చేసింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వీరంతా గురువారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అదనపు డీసీపీ పి. వెంకట రమణ ఆధ్వర్యంలో గుజరాత్‌కు బయలుదేరారు.
ఈ బృందంలో పెండ్యాల కేశవరెడ్డి, అన్నవరం దేవేందర్, ఏ. కిరణ్ కుమార్, సింగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గోగుల ప్రసాద్, అకెనపల్లి నాగరాజు, చీటీ అజిత్ కుమార్, కాకుల మారి ప్రసూన్ రావు (విజయ్), కొండపల్లి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. వీరు శుక్రవారం ఉదయం ఏక్తానగర్‌కు చేరుకుని, శనివారం నిర్వహించనున్న రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొననున్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈ కార్యక్రమానికి తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వ్యక్తులను ఆహ్వానించారు. జాతీయ సమైక్యత, ఐక్యతా భావాన్ని చాటిచెప్పే ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించడం పట్ల కరీంనగర్ బృందం సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
