- లోటు వర్షపాతం ఉన్న మండలాలను ఎందుకు విస్మరించారు? అర్హులైన రైతులకు న్యాయం చేయాలి
కరీంనగర్, అక్టోబర్ 28 (చైతన్యగళం):
కరువు మండలాల ఎంపికలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యధిక లోటు వర్షపాతం నమోదైన అనేక మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాల జాబితాలో చేర్చకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కరువు మండలాల ఎంపిక అశాస్త్రీయంగా జరిగిందనే అనుమానాలు జాబితాను పరిశీలిస్తే కలుగుతున్నాయని అన్నారు.
హుస్నాబాద్, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లోని అనేక మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ వాటిని ఎందుకు గుర్తించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. 35 శాతం లోటు వర్షపాతం నమోదైన మండలాలు సైతం జాబితాలో లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. పొలాలు బీళ్లుగా మారి రైతులు సాగునీరు, తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడితే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని అన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అనేక మండలాలు కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తింపు పొందేందుకు అర్హత కలిగి ఉన్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో వర్షపాతం, సాగు విస్తీర్ణం, పంటల పరిస్థితులను ఒకే ప్రమాణాలతో పరిశీలించారా? కరువు మండలాల ఎంపికకు ఉపయోగించిన అధికారిక గణాంకాలు, ప్రమాణాలు ఏమిటి? జాబితాలో చోటు దక్కని మండలాల్లో పంట నష్టం, నేలలో తేమ, భూగర్భ జలాల పరిస్థితులను పరిశీలించారా? రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్నారా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర సగటు వర్షపాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా ప్రతి మండలంలోని వర్షపాతం, పంటల పరిస్థితులను విడివిడిగా పరిశీలించాలని సూచించారు. ఒక మండలంలో వర్షాలు కురిసినంత మాత్రాన పక్క మండలంలోనూ అదే పరిస్థితి ఉందని భావించడం శాస్త్రీయ విధానం కాదని పేర్కొన్నారు. కరువు మండలాల గుర్తింపునకు ఉపయోగించిన గణాంకాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని, ప్రతి మండలానికి సంబంధించిన వర్షపాతం లోటు, పంటల పరిస్థితి, సాగు విస్తీర్ణం, నేలలో తేమ, భూగర్భ జలాల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.
సర్వేలో మినహాయించిన గ్రామాలు, మండలాల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి పరిశీలించాలని బండి సంజయ్ కోరారు. అర్హత ఉన్న మండలాలను జాబితా నుంచి మినహాయించినట్లు తేలితే, నిబంధనలకు అనుగుణంగా వాటిని చేర్చాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాలకు తావులేకుండా క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా కరువు మండలాలను ప్రకటించాలని అన్నారు.
కరువు ప్రభావిత రైతులకు అర్హత మేరకు సహాయక చర్యలు అందించాలని, పేదలకు పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు. రైతులు, పేదలకు అన్యాయం జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
