Friday, October 30, 2026
Homeతెలంగాణమహబూబ్‌నగర్సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటులో కొండారెడ్డిపల్లి ఆదర్శం

సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటులో కొండారెడ్డిపల్లి ఆదర్శం

📰 Generate e-Paper Clip

  • ప్రతి ఇంటికీ సౌర విద్యుత్‌ అందించడమే లక్ష్యం: జిల్లా కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

నాగర్‌కర్నూల్‌, అక్టోబర్‌ 28 (చైతన్యగళం):

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని బల్మూర్‌ మండలం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ఆదర్శ సౌర గ్రామంగా అభివృద్ధి చేస్తూ, ప్రతి ఇంటికీ సోలార్‌ ప్యానెళ్ల ద్వారా సౌర విద్యుత్‌ సదుపాయం కల్పించేందుకు చేపడుతున్న చర్యలు అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. గ్రామాన్ని వంద శాతం సౌర విద్యుత్‌ వినియోగ గ్రామంగా తీర్చిదిద్దడం ద్వారా సంప్రదాయ విద్యుత్‌పై ఆధారపడటాన్ని తగ్గించడంతోపాటు, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించవచ్చని పేర్కొన్నారు. కొండారెడ్డిపల్లి గ్రామం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

బుధవారం అచ్చంపేట సబ్‌ కలెక్టర్‌ సలోని చాబ్రాతో కలిసి బల్మూర్‌ మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో కలెక్టర్‌ పర్యటించారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు, అంగన్‌వాడీ కేంద్రం, గృహాలపై ఏర్పాటు చేసిన సోలార్‌ ప్యానెళ్లు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలేపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ పునఃసర్వే పనులను పరిశీలించారు.

కొండారెడ్డిపల్లిలో ఇప్పటివరకు సుమారు 101 ఇళ్లపై సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. తెలంగాణ రెడ్కో భాగస్వామ్యంతో ప్రతి ఇంటికీ సౌర విద్యుత్‌ సదుపాయం కల్పించేందుకు చేపడుతున్న చర్యలపై కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన ఇళ్లపై కూడా ప్యానెళ్ల ఏర్పాటును వేగవంతం చేసి, గ్రామాన్ని పూర్తిస్థాయి సౌర గ్రామంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లకు సైతం త్వరితగతిన సౌర విద్యుత్‌ కనెక్షన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎల్లమ్మ, పార్వతమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్‌ పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, ఇప్పటివరకు అందిన బిల్లులు, పెండింగ్‌లో ఉన్న బిల్లుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు రూ.3.40 లక్షల మేర బిల్లులు చెల్లించామని, మరో బిల్లు పెండింగ్‌లో ఉందని అధికారులు వివరించారు. పెండింగ్‌ బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌ చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, కేంద్రం నిర్వహణ, పిల్లల సంరక్షణకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతోపాటు వారి ఆరోగ్యం, ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. పిల్లల పోషకాహార స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, వారికి అవసరమైన సేవలు సక్రమంగా అందేలా చూడాలని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించిన కలెక్టర్‌ వారి పేర్లను అడిగి తెలుసుకుని, వారితో కొద్దిసేపు సరదాగా గడిపారు. అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు మెరుగైన వాతావరణం కల్పించాలని సూచించారు.

గ్రామంలో రూ.20 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవన పనులను కూడా కలెక్టర్‌ పరిశీలించారు. ఇప్పటివరకు సుమారు 70 శాతం పనులు పూర్తయ్యాయని, మరో రెండు నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, పనుల్లో జాప్యం జరగకుండా నిర్ణీత గడువులోగా భవనాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. భవనం అందుబాటులోకి వస్తే స్థానిక ప్రజలకు పరిపాలనా సేవలు మరింత సులభంగా అందుతాయని పేర్కొన్నారు.

అనంతరం పోలేపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ పునఃసర్వే పనులను కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూముల వివరాల సేకరణ, సర్వే ప్రక్రియ, భూ రికార్డుల నమోదు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూ పునఃసర్వేను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో భూముల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, రికార్డుల్లో ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. సర్వే సమయంలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో బల్మూర్‌ మండల తహసీల్దార్‌, ఎంపీడీవో, వ్యవసాయ, పశువైద్య, విద్యాశాఖల అధికారులు, తెలంగాణ రెడ్కో అధికారులు, గ్రామ సర్పంచ్‌ రాధాకృష్ణ, ఉపసర్పంచ్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!