Wednesday, October 28, 2026
Homeతెలంగాణకరీంనగర్ఆస్తిపన్ను వసూళ్లు, భువన్‌ సర్వే వేగవంతం చేయాలి

ఆస్తిపన్ను వసూళ్లు, భువన్‌ సర్వే వేగవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

  • నిర్దేశిత గడువులోగా సర్వే పూర్తి చేయాలి.. నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌

కరీంనగర్‌, అక్టోబర్‌ 27 (చైతన్యగళం):

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తిపన్ను వసూళ్లను వేగవంతం చేయడంతోపాటు, పెండింగ్‌లో ఉన్న అసెస్‌మెంట్ల భువన్‌ యాప్‌ సర్వేను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, ఆర్‌వోలు, ఆర్‌ఐలు, వార్డు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.

సీడీఎంఏ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో భువన్‌ యాప్‌ సర్వే, ఆస్తిపన్నుల వసూళ్లు, నగరపాలక సంస్థకు చెందిన దుకాణాల అద్దెలు తదితర అంశాలపై సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న అసెస్‌మెంట్ల భువన్‌ యాప్‌ సర్వే మ్యాపింగ్‌ను పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పెండింగ్‌ జాబితా ఆధారంగా సంబంధిత ఆస్తుల యజమానులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించి, గురువారం నుంచి సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించారు.

భువన్‌ మ్యాపింగ్‌ సర్వేలో భాగంగా నివాస భవనాల నిర్మాణ వివరాలతోపాటు, భవనానికి సంబంధించిన ఫొటోలు, అవసరమైన పత్రాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని కమిషనర్‌ సూచించారు. నగరపాలక సంస్థకు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఆస్తిపన్నుల వసూళ్లను వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నివాస, వాణిజ్య ఆస్తుల పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేయడంతోపాటు, నగరపాలక సంస్థ దుకాణాల అద్దెల బకాయిలను కూడా రాబట్టాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భువన్‌ యాప్‌ సర్వేపై నగర ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రఫుల్‌ దేశాయ్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న భవన నిర్మాణానికి సంబంధించిన ఆస్తిపన్నులో ఎలాంటి మార్పు ఉండదని, ఇప్పటికే ఉన్న నిర్మాణం ప్రకారమే పన్ను కొనసాగుతుందని వివరించారు. ప్రస్తుత నిర్మాణానికి అదనంగా ఇతర నిర్మాణాలు ఉన్నట్లయితే, వాటిని మ్యాపింగ్‌ ద్వారా గుర్తించిన అనంతరం ఆస్తిపన్ను సవరణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నగర ప్రజలు 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును సకాలంలో చెల్లించి, నగర అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో అదనపు కమిషనర్‌ ఆయాజ్‌, డిప్యూటీ కమిషనర్లు వేణుమాధవ్‌, ఖాదర్‌ మొహియుద్దీన్‌, ఆర్‌వోలు, ఆర్‌ఐలు, వార్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!