Saturday, November 21, 2026
Homeతెలంగాణకరీంనగర్ఐఐటీ బాంబేలో విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

ఐఐటీ బాంబేలో విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

  • డైరెక్టర్‌ శిరీష్‌ కేదారే రాజీనామా చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్‌

కరీంనగర్‌, అక్టోబర్‌ 27 (చైతన్యగళం):

ముంబైలోని ఐఐటీ బాంబేలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో యాజమాన్యం విఫలమైందని ఆరోపిస్తూ, ఐఐటీ బాంబే డైరెక్టర్‌ శిరీష్‌ కేదారే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరారు. సోమవారం కరీంనగర్‌లోని మంకమ్మతోటలో ఉన్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ అంశంపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ గత 13 నెలల్లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. సాహిల్‌ వాకోడే మరణం విషయంలో ఐఐటీ బాంబే యాజమాన్యం వ్యవహరించిన తీరుపై విమర్శలు చేశారు. పూర్తిస్థాయి విచారణ జరగకముందే సాహిల్‌పై ఆరోపణలతో ప్రకటన విడుదల చేయడం బాధ్యతారాహిత్యమని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలుపుతున్న విద్యార్థులతో చర్చలు జరపాల్సిన యాజమాన్యం, వారిని నిర్బంధించడం, నిరసన స్థలాన్ని తొలగించడం వంటి చర్యలకు పాల్పడటం సరికాదని అన్నారు. విద్యార్థులకు చెందిన ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లు, మందులు, పుస్తకాలు, గదుల తాళాలు, ఇతర అవసరమైన వస్తువులను వెంటనే తిరిగి అందించాలని కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా వారి నిరసనలను అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధమని పేర్కొన్నారు.

విద్యార్థులకు మెరుగైన మానసిక ఆరోగ్య సేవలు అందించాలని, క్యాంపస్‌లో సమానత్వం, భద్రతతో కూడిన వాతావరణాన్ని కల్పించాలని శ్రీకాంత్‌ కోరారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంతోపాటు, నిరసనల్లో పాల్గొన్న వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడకూడదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ కరీంనగర్‌ జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది.

ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇసాక్‌, ఆకాష్‌, సురేష్‌, జిల్లా కమిటీ సభ్యులు రక్షక, నరేష్‌, సంతోష్‌, నాయకులు రిషి, హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!