- పాఠశాల భవనం, భోజనశాల మరమ్మతులు.. గ్రామంలో ఓపెన్ జిమ్, ఉద్యానవనం, వాటర్ ప్లాంట్ ఏర్పాటు
కందుకూరు, అక్టోబర్ 27 (చైతన్యగళం):
విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే వారు చదువుపై మరింత ఆసక్తి చూపుతారని అమెజాన్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కందుకూరు మండలం ఆకులమైలారం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం, భోజనశాల మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులను అమెజాన్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా గ్రామపంచాయతీ సమీపంలో ఓపెన్ జిమ్, ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయడంతోపాటు, ఆకులమైలారం అనుబంధ గ్రామమైన మాలగూడలో నీటి శుద్ధి కేంద్రాన్ని కూడా ప్రారంభించారు.
ఈ అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగేందుకు గ్రామ సర్పంచ్ ఏర్పుల నరేష్, ఉప సర్పంచ్ అచ్చన సురేష్ ప్రత్యేక చొరవ చూపారు. అమెజాన్ సంస్థ ప్రతినిధులతో పాటు అధికారులతో పలుమార్లు చర్చిస్తూ పనుల పురోగతికి కృషి చేశారు. గ్రామంలో విద్యార్థులకు, ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించడంలో వారు కీలక పాత్ర పోషించారు.
కార్యక్రమానికి విచ్చేసిన అమెజాన్ సంస్థ ప్రతినిధులకు విద్యార్థులు పూలతో స్వాగతం పలికి ఘనంగా ఆహ్వానించారు. విద్యార్థుల ఆటపాటలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామ పెద్దలు, మహిళలు, యువతీ యువకులు పాల్గొని చప్పట్లతో అమెజాన్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో విద్యా, ప్రజోపయోగ సదుపాయాల అభివృద్ధికి సంస్థ అందించిన సహకారాన్ని అభినందించారు.
