- మున్సిపల్ సిబ్బందితో బీఆర్ఎస్ కార్యకర్తల వాగ్వాదం.. అంబేడ్కర్ చౌరస్తాలో రాస్తారోకో
హుస్నాబాద్, నవంబర్ 20 (నీలగిరి ఎక్స్‌ప్రెస్):
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో దీక్షా దివాస్ ఫ్లెక్సీ తొలగింపు వివాదానికి దారితీసింది. ఈ నెల 29న బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న దీక్షా దివాస్ కార్యక్రమానికి సంబంధించి పార్టీ కార్యకర్తలు హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో గురువారం రాత్రి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే శుక్రవారం ఉదయానికల్లా మున్సిపల్ సిబ్బంది దానిని తొలగించారు.
ఫ్లెక్సీ తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోనే ఫ్లెక్సీని తొలగించారని వారు ఆరోపించారు. అనంతరం తొలగించిన ఫ్లెక్సీని తీసుకొచ్చి అంబేడ్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బీఆర్ఎస్ నాయకులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.

