సిరిసిల్ల, అక్టోబర్ 17 (చైతన్యగళం):
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్‌పై వచ్చిన థర్డ్ డిగ్రీ ఆరోపణల నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఎస్ఐ శ్రీకాంత్‌ను తక్షణమే ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే.. ఎస్ఐ శ్రీకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారంతో వరుస కథనాలు ప్రచురించారనే కారణంతో పోతురి శేఖర్, రాతిపల్లి సంపత్‌లపై గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం 2026 అక్టోబర్ 13న పోలీస్ స్టేషన్లో వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, రిమాండ్‌కు తరలించారనే ఆరోపణలు ఎస్ఐపై వచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులును విచారణ అధికారిగా నియమించినట్లు ఎస్పీ తెలిపారు. డీఎస్పీ స్థాయి అధికారితో సమగ్ర విచారణ జరిపించి, ఆయన సమర్పించే తుది నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విచారణలో ఏ అధికారి తప్పు చేసినట్లు తేలినా శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ మహేష్ బి. గితే హెచ్చరించారు.
