Saturday, October 17, 2026
Homeతెలంగాణపట్టభద్రుల పోరులో కమలం వ్యూహం: ఆలస్యమా? ఆచితూచి అడుగులా?

పట్టభద్రుల పోరులో కమలం వ్యూహం: ఆలస్యమా? ఆచితూచి అడుగులా?

📰 Generate e-Paper Clip

  • వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కసరత్తు!
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రవర్ణ అభ్యర్థుల ప్రకటనతో మారిన సమీకరణాలు!
  • తెలంగాణలో రాజుకుంటున్న బీసీ వాదం.. కమలనాథుల నజరు వెనుకబడిన వర్గాలపైనేనా?
  • సంఘ్ నేపథ్యం, సేవాతత్పరత కలిగిన డాక్టర్ వన్నాల వెంకటరమణ వైపే మెజారిటీ శ్రేణుల మొగ్గు!

హైదరాబాద్, అక్టోబరు 16(చైతన్యగళం):
రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ఉమ్మడి వరంగల్ – ఖమ్మం – నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల రణరంగం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసి, క్షేత్రస్థాయిలో ఓటర్ల నమోదు ప్రక్రియతో పాటు సన్నాహక సమావేశాలతో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. అయితే, క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రకటనలో ఇంకా స్పష్టత ఇవ్వకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ముందుకెళ్తుంటే బీజేపీ వెనుకబడిందన్న భావన స్థానిక శ్రేణుల్లో వ్యక్తమవుతున్నప్పటికీ, దీని వెనుక కాషాయ దళం పక్కా రాజకీయ వ్యూహం రచిస్తున్నదని విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.

ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు రచిస్తూ బీసీ అస్త్రంపై బీజేపీ దృష్టి సారించిందని తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ అగ్రవర్ణ సామాజిక వర్గాలకు చెందిన నేతలను బరిలోకి దించాయి. దీంతో బీజేపీకి సామాజిక సమీకరణాల పరంగా అద్భుతమైన అవకాశం కలిసివచ్చినట్లయింది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బీసీ ఉద్యమం విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతనే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతామని గతంలోనే పార్టీ అగ్రనాయకత్వం ప్రకటించింది. ఆ మాటకు కట్టుబడి ఉన్నామని చాటిచెప్పేందుకు, క్షేత్రస్థాయిలో వెనుకబడిన వర్గాల ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఈ పట్టభద్రుల స్థానాన్ని బీసీ అభ్యర్థికే కేటాయించాలన్న ఆలోచనతో అధిష్ఠానం తీవ్ర కసరత్తు చేస్తోంది.

అగ్రవర్ణ అభ్యర్థులతో తలపడుతున్న ప్రధాన పార్టీలకు చెక్ పెట్టాలంటే, సమర్థుడైన బీసీ విద్యావంతుడిని బరిలోకి దింపడమే సరైన వ్యూహమని పార్టీ నాయకత్వం భావిస్తోంది.అందులో భాగంగా
ఆశావహుల తాకిడి క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు బీజేపీలోని పలువురు నేతలు దరఖాస్తు చేసుకోగా, ఇతర పార్టీల్లో అవకాశాలు దక్కని కొందరు నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. అయితే, బయటి వ్యక్తుల కంటే పార్టీకి అంకితభావంతో పనిచేసిన నిఖార్సైన సిద్ధాంతవాదులకే ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులు, నేతల నుంచి బీజేపీ నాయకత్వం రహస్యంగా అభిప్రాయ సేకరణను చేపట్టింది. ఈ అభిప్రాయ సేకరణలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో సుదీర్ఘ అనుబంధం ఉన్న డాక్టర్ వన్నాల వెంకటరమణ పేరు ముందంజలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

రేసులో ముందువరుసలో డాక్టర్ వన్నాల వెంకటరమణ

వరంగల్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సుపరిచితులైన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు పెద్ద కుమారుడైన డాక్టర్ వన్నాల వెంకటరమణ అభ్యర్థిత్వాన్ని మెజారిటీ శ్రేణులు బలంగా బలపరుస్తున్నట్లు సమాచారం. విద్యా నేపథ్యం, సంఘ్ భావజాలం కలిగిన కుటుంబం కావడంతో కలిసి వచ్చే అవకాశం లేకపోలేదు.ఉన్నత విద్యావంతుడైన డాక్టర్ వన్నాల వెంకటరమణ విదేశాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసి డెంటల్ ప్రొఫెసర్‌, కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. మొదట్నుంచీ ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో సిద్ధాంత నిబద్ధత కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. గత నాలుగేళ్లుగా పూర్తిస్థాయిలో తన వృత్తిని పక్కనపెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో గణనీయమైన సంఖ్యలో ఉన్న బలమైన బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం ఆయనకు ప్రధాన అనుకూలాంశంగా కూడా కలిసిరావచ్చు అనే అభిప్రాయం కూడా పార్టీ శ్రేణులు వ్యక్తపర్చుతున్నారు.

రాజకీయాలకే పరిమితం కాకుండా ‘వాక్’ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా గత 20 సంవత్సరాలుగా దాదాపు 300 పేద కుటుంబాలకు ప్రతినెలా 10 కేజీల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. అనాథ పిల్లల చదువులకు ఫీజుల చెల్లింపు, పేద కుటుంబాలకు అత్యవసర వైద్య ఖర్చులకు అండగా నిలవడం వంటి సేవా కార్యక్రమాల ద్వారా విస్తృత ప్రజాదరణ సంపాదించుకున్నారు.

ఒకవేళ అధిష్ఠానం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, బీసీ మహిళను బరిలోకి దించాలనే ఆలోచన చేస్తే.. డాక్టర్ వన్నాల వెంకటరమణ సతీమణి, ఉన్నత విద్యావంతురాలైన పీహెచ్‌డీ ప్రొఫెసర్ శ్రీమతి పాము పావన పేరును పరిగణనలోకి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మహిళా పట్టభద్రులను ఆకర్షించేందుకు, విద్యారంగ అనుభవం ఉన్న మహిళా మేధావిని రంగంలోకి దించడం వ్యూహాత్మకంగా కలిసివస్తుందని పార్టీ శ్రేణులు విశ్లేషిస్తున్నాయి.

ఏళ్ల తరబడి ఎన్ని ప్రలోభాలు ఎదురైనా బీజేపీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్న నేతగా మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు మంచి గుర్తింపు ఉంది.

పట్టభద్రులను ప్రభావితం చేయగల విద్యావేత్తగా డాక్టర్ వన్నాల వెంకటరమణ అభ్యర్థిత్వం అన్నివిధాలా సరితూగుతుందని స్థానిక బీజేపీ వర్గాలు ముక్తకంఠంతో స్పష్టం చేస్తున్నాయి. అధికారంలోకి వస్తే బీసీ సీఎం హామీకి విశ్వసనీయత పెరగాలన్నా, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రవర్ణ అభ్యర్థులకు గట్టి సమాధానం ఇవ్వాలన్నా బీజేపీ నుంచి బీసీ విద్యావంతుడైన అభ్యర్థే బరిలో ఉండాలని కేడర్ గట్టిగా కోరుతోంది. మరి కాషాయ దళాధిపతులు బీసీ నినాదాన్ని అందిపుచ్చుకుని ఈ సీటును దక్కించుకుంటారా? లేక ఊహించని నిర్ణయం తీసుకుంటారా? అనేది త్వరలోనే తేలనుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!