- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యం: గోవర్ధన్ రెడ్డి
కరీంనగర్, అక్టోబర్ 17 (చైతన్యగళం):
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిమళాన్ని విదేశీ గడ్డపై చాటుతూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్ విల్లా నోవా సముదాయంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. ప్రముఖ వ్యాపారవేత్త గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో తెలంగాణ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు.
రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి గౌరీదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ గీతాలను ఆలపిస్తూ, చప్పట్లు కొడుతూ లయబద్ధంగా కోలాటాలు ఆడారు. మహిళల నృత్యాలు, బతుకమ్మ పాటలతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఆలపించిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
భావితరాలకు తెలంగాణ సంస్కృతిని అందించాలి
ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ యూఏఈలో నివసిస్తున్న తెలంగాణ ప్రజల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేయడంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తెలంగాణ పండుగలు, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ముఖ్యంగా యూఏఈలో పుట్టి పెరుగుతున్న పిల్లలకు తెలంగాణ సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాల గొప్పతనాన్ని పరిచయం చేయడంలో ఇటువంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, మహిళల ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విదేశాల్లోనూ సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, భగవాన్ రెడ్డితో పాటు విల్లా నోవా సముదాయ సభ్యులు పాల్గొన్నారు. మహిళలు, కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొనడంతో బతుకమ్మ సంబరాలు ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి.
