Sunday, October 18, 2026
Homeఆంధ్రప్రదేశ్వైభవంగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

వైభవంగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

  • మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారి దర్శనం.. ఘనంగా బిందెసేవ
  • ఉత్సవాల్లో పాల్గొన్న ఆర్యవైశ్య మహాసభ నాయకులు, సీనియర్‌ సివిల్‌ జడ్జి శోభారాణి

నందికొట్కూరు, అక్టోబర్‌ 16 (చైతన్యగళం‌):

నందికొట్కూరులోని శ్రీ చక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో శుక్రవారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు అమ్మవారిని చందనంతో మహాలక్ష్మి దేవిగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తిని సరస్వతీ దేవిగా అలంకరించడంతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన బిందెసేవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకులు, జిల్లా, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.

విశేష అభిషేకాలు.. ప్రత్యేక పూజలు

ఉదయం 4.30 గంటలకు సుప్రభాత సేవతో ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పంచామృతాలు, పంచద్రవ్యాలతో శ్రీ సూక్త విధానంలో అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు పుష్పార్చన, విశేష పూజలు, కలశ పూజలు, సాధారణ పూజలు నిర్వహించి మహా మంగళహారతి సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

వైభవంగా బిందెసేవ.. భారీగా పాల్గొన్న భక్తులు

ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్‌ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య, కార్యదర్శి నాగేళ్ల రాజగోపాల్‌, ఈసీ సభ్యుడు వీరబొమ్మ నాగ సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు టంగుటూరి సీనయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీరామ వెంకట సుబ్రమణ్యం, కోశాధికారి వంకదర వేణుగోపాల్‌, కార్యక్రమాల కమిటీ చైర్మన్‌ మొగిలిపల్లి భరతుడు తదితరులు బిందెసేవలో పాల్గొన్నారు.

బిందెసేవకు దాతలుగా వ్యవహరించిన జొన్నలగడ్డ పిచ్చయ్య, నాగమణి దంపతుల కుమారుడు శ్రీరంగ అవినాష్‌ గుప్తా తొలి బిందెను ఎత్తుకోగా, ఆంధ్రప్రదేశ్‌ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య ఊరేగింపును ప్రారంభించారు. మేళతాళాలు, కోలాటాలు, నృత్యాల నడుమ బిందెసేవ ఉత్సాహభరితంగా సాగింది. ఆర్యవైశ్య మహిళలు, సంఘం సభ్యులు, యువజన సంఘం ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి భక్తిపూర్వకంగా సేవలందించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

సాయంత్రం కాకనూరు శ్రీశ్రీ శివయోగేంద్ర సరస్వతి స్వామి (బాలస్వామి) అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించడంతోపాటు చిన్నారులకు బీజాక్షరాలు నేర్పించారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎ. శోభారాణి కూడా ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి ఆశీస్సులు పొందారు.

రాత్రి 8.30 గంటలకు మహా మంగళహారతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. పట్టణ ఆర్యవైశ్యులు, ఆలయ కమిటీ సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భీమిశెట్టి జయరామకృష్ణ మాట్లాడుతూ, భక్తుల సహకారం, సంఘం సభ్యుల సమష్టి కృషితో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!