- ప్రజలు నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలి: మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)
జమ్మికుంట, అక్టోబర్ 27 (చైతన్యగళం):
ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) సూచించారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, నీటి వృథాను అరికట్టి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు.
ప్రతిరోజూ నల్లాల ద్వారా సరఫరా చేసే నీటిని అవసరమైనంత మాత్రమే వినియోగించాలని సూచించారు. ప్రతి ఇంట్లో తగినంత నీటిని నిల్వ చేసుకునే ఏర్పాట్లు చేసుకోవాలని, మిగిలిన నీటిని వృథా చేయకుండా సాధ్యమైనంతవరకు ఇతర అవసరాలకు తిరిగి వినియోగించుకోవాలని తెలిపారు. ఇళ్లను శుభ్రం చేయడానికి, బట్టలు ఉతకడానికి ఉపయోగించే నీటిని కూడా వృథా చేయకుండా, వీలైన చోట నిల్వ చేసుకుని ఇతర అవసరాలకు ఉపయోగించాలని పేర్కొన్నారు. నీటి సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఎల్‌నినో ప్రభావంతో తీవ్రమైన ఎండలు, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రశాంత్ కుమార్ సూచించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కోరారు. నీటి పొదుపుతోపాటు ఆరోగ్య పరిరక్షణకు కూడా ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ సూచనలను పాటించాలని, నీటి సంరక్షణ చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
