Tuesday, October 27, 2026
Homeతెలంగాణకరీంనగర్ప్రకృతి వ్యవసాయంతో భావితరాలకు సారవంతమైన నేల

ప్రకృతి వ్యవసాయంతో భావితరాలకు సారవంతమైన నేల

📰 Generate e-Paper Clip

  • నేలను కాపాడుకోవాలి.. ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలి: కేవీకే ప్రధాన శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు

జమ్మికుంట, అక్టోబర్‌ 27 (చైతన్యగళం):

ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రధాన శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు రైతులకు సూచించారు. ఖేత్‌ బచావో అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్‌ గ్రామ రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమి ఆరోగ్యం మనిషి ఆరోగ్యంతో సమానంగా ముఖ్యమని, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా నేల సారాన్ని కాపాడితే భావితరాలకు సారవంతమైన భూమి అందించడంతోపాటు భవిష్యత్తులో మంచి దిగుబడులు పొందవచ్చని తెలిపారు.

ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో జలవిద్యుత్‌ ఉత్పత్తి తగ్గినందున, ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు వరి సాగు విస్తీర్ణాన్ని సాధ్యమైనంత తగ్గించి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కోరారు. నీటి వసతి ఉన్న రైతులు కూడా ఆరుతడి పంటలైన పెసర, మినుము, కుసుమ, నువ్వులు, పొద్దుతిరుగుడు, శనగ, బుడ్డశనగ, మొక్కజొన్న పంటలను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి షేక్‌ ఖాదర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ సూచనలను పాటించి పంటల సాగులో తగిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. మొక్కజొన్న విత్తన రకం డీహెచ్‌ఎం 206 (కరీంనగర్‌ మక్క–3), శనగ, కుసుమ విత్తనాలను సబ్సిడీపై అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతు రిజిస్ట్రీ చేసుకున్న వారికి ఈ విత్తనాలు అందజేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల రైతులు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని సూచించారు.

ఉద్యానవన అధికారి మంజులత మాట్లాడుతూ ఆయిల్‌పామ్‌ సాగు రైతులకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. ఒకసారి పంటను సాగు చేస్తే సుమారు 30 సంవత్సరాల వరకు దిగుబడులు పొందే అవకాశం ఉందని వివరించారు. సబ్సిడీపై స్ప్రింక్లర్‌ పరికరాలు పొందేందుకు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి బి. అచ్యుత్‌, ఆయిల్‌పామ్‌ క్షేత్ర సహాయకుడు శ్రీధర్‌, పలువురు రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!