Friday, October 16, 2026
Homeతెలంగాణకరీంనగర్మహాచండీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

మహాచండీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

📰 Generate e-Paper Clip

  • మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌

కరీంనగర్‌, అక్టోబర్‌ 14 (చైతన్యగళం):

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి ఆలయంలో అమ్మవారు మహాచండీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నిర్వాహకులు అమ్మవారిని పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా అలంకరించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

చెడుపై మంచి విజయానికి ప్రతీక మహాచండీ దేవి

శరన్నవరాత్రి ఉత్సవాల్లో మహాచండీ దేవి అవతారానికి విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఆదిశక్తి స్వరూపిణిగా పూజలందుకునే అమ్మవారు దుష్టశక్తులను సంహరించి ధర్మాన్ని కాపాడే శక్తికి ప్రతీకగా నిలుస్తారు. దేవీ మహాత్మ్యం ప్రకారం మహిషాసురుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించిన జగన్మాత పరాక్రమం అమ్మవారి శక్తిసామర్థ్యాలను చాటిచెబుతుంది. ఆయుధధారిణిగా సింహవాహనంపై కొలువుదీరిన చండీదేవి రూపం ధైర్యం, సాహసం, విజయానికి ప్రతీకగా భక్తులు భావిస్తారు. అమ్మవారిని ఆరాధించడం వల్ల భయం తొలగి, ఆత్మవిశ్వాసం పెరిగి, జీవితంలోని అడ్డంకులను అధిగమించే శక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.

శుక్రవారం సరస్వతీ పూజ.. సాయంత్రం పల్లకీ సేవ

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మహాశక్తి ఆలయంలో సరస్వతీ పూజ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం అమ్మవారి పల్లకీ సేవతో పాటు రతన్‌కుమార్‌ బృందం ఆధ్వర్యంలో నృత్య కార్యక్రమం నిర్వహించనున్నారు.

అదే రోజు రాత్రి 9 గంటలకు దాండియా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ఎరుపు రంగు దుస్తులు ధరించి రావాలని ఆలయ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!