హుస్నాబాద్ నవంబర్ 9(చైతన్యగళం):
హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామ శివారులోని బ్రిడ్జి దాటిన తర్వాత పవనసుత మిల్లు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో తండ్రి, ఏడేళ్ల కుమార్తె మృతి చెందారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పైడిపల్లి శ్రీకాంత్ (32) హైదరాబాద్‌లో అద్దె కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొండాపూర్ గ్రామంలో ఓ కార్యక్రమం ఉండటంతో భార్య స్వాతి, కుమార్తె మహాన్వి (7), కుమారుడు విహాన్ క్రిష్‌తో కలిసి హైదరాబాద్ నుంచి కారులో స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పందిళ్ల గ్రామం దాటిన తర్వాత పవనసుత మిల్లు సమీపంలో వీరి కారు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్, కుమార్తె మహాన్వి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన భార్య స్వాతితో పాటు కుమారుడు విహాన్ క్రిష్‌ను చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కుమారుడికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ట్రాక్టర్ డ్రైవర్ కాలు విరగడంతో అతడిని కూడా ఆసుపత్రికి తరలించారు. కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వస్తుండగా జరిగిన ఈ విషాద ఘటనతో కొండాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి, చిన్నారి కుమార్తె ఒకేసారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
