హుస్నాబాద్ నవంబర్ 9 (చైతన్యగళం):
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామానికి చెందిన ఆవుదూత అలియాస్ పెట్టుగడి బాలవ్వ తన స్వంత భూమికి పట్టా చేసి పాసుపుస్తకం ఇప్పించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గౌరవెల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 261/సిలో తనకు సంబంధించిన నాలుగున్నర గుంటల భూమిని తన పేరుపై పట్టా చేసి పాసుపుస్తకం జారీ చేయడంలో అధికారులు జాప్యం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలవ్వ మాట్లాడుతూ తన భూమికి సంబంధించి కోర్టు డిక్లరేషన్ తీర్పు కూడా వచ్చిందని, అయినప్పటికీ గత కొన్ని నెలలుగా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ మనోవేదనకు గురవుతున్నానని పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తన భూమికి పట్టా చేసి పాసుపుస్తకం ఇప్పించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని వృద్ధురాలు బాలవ్వ విజ్ఞప్తి చేశారు.
