- వ్యవసాయానికి 12 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి: మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
హుస్నాబాద్, అక్టోబర్ 12 (చైతన్యగళం):
వ్యవసాయానికి విద్యుత్ కోతలను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ధర్నా నిర్వహించారు. వ్యవసాయానికి 12 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్–కరీంనగర్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.
ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ.. వ్యవసాయానికి 12 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, కనీసం నాలుగు గంటల పాటు కూడా సక్రమంగా విద్యుత్ అందించడం లేదని ఆరోపించారు. విద్యుత్ సరఫరా అవుతున్న కొద్దిసేపు కూడా లో వోల్టేజీ సమస్య తలెత్తడంతో రైతుల విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం చేతికందే దశలో ఉన్న పంటలకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, వ్యవసాయానికి 12 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
