- వరి సాగుతో తీవ్ర నష్టాలు.. రావాల్సిన డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు
- కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.. ప్రజావాణిలో రైతుల ఫిర్యాదు
హుస్నాబాద్, అక్టోబర్ 12 (చైతన్యగళం):
శ్రీకర్ సీడ్స్ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన హామీలను నమ్మి వరి సాగు చేసి తీవ్రంగా నష్టపోయామని, తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతూ రైతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమను నష్టపరిచిన సంబంధిత కంపెనీ, ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. అంతకపేటకు చెందిన బదనపురం మొగిలి (రేషన్ డీలర్), జీలుగుల గ్రామానికి చెందిన మెరుగు శ్రీనివాస్‌రెడ్డి శ్రీకర్ సీడ్స్ కంపెనీకి సంబంధించిన వ్యవహారాల్లో తమను సంప్రదించినట్లు తెలిపారు. తమ బావుల వద్దకు వచ్చి శ్రీకర్ సీడ్స్ వరి విత్తనాలతో సాగు చేస్తే ఎకరానికి రూ.70 వేల వరకు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
వారి మాటలు నమ్మి గత యాసంగి సీజన్‌లో వరి సాగు చేయగా, ఎకరానికి కేవలం రెండు నుంచి మూడు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పండిన ధాన్యాన్ని కంపెనీ ప్రతినిధులు తీసుకెళ్లినప్పటికీ, తమకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు.
ఈ విషయమై హుస్నాబాద్ సీఐ శ్రీధర్‌ను కలిసి ఫిర్యాదు చేయగా, నెల రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. అయితే గడువు ముగిసిన తర్వాత తిరిగి సంప్రదించగా, డబ్బులు లేవని చెప్పారని, దీంతో తమకు న్యాయం జరగలేదని వాపోయారు.
ఈ నేపథ్యంలో సోమవారం ప్రజావాణిలో మరోసారి ఫిర్యాదు చేసినట్లు రైతులు పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ స్పందించి, సంబంధిత కంపెనీ, ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులను ఆదేశించాలని కోరారు. తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు.
