- బొట్టు పెట్టి సభకు ఆహ్వానించిన బీఆర్ఎస్ మహిళా నాయకులు
హుస్నాబాద్, నవంబర్ 27 (చైతన్యగళం):
ఈ నెల 29న కరీంనగర్ జిల్లా అల్గునూరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దీక్షా దివస్ భారీ బహిరంగ సభకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి సభకు ఆహ్వానించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో సభ ప్రాధాన్యతను వివరిస్తూ ఆహ్వానాలు అందించారు.
ఈ సందర్భంగా 18వ వార్డు కౌన్సిలర్ వాల సుప్రజా నవీన్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి 16 రోజుల పాటు పోరాటం చేశారని గుర్తుచేశారు. ఆయన దీక్ష, ఉద్యమ పోరాట ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29వ తేదీకి ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆ చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ నిర్వహిస్తున్న దీక్షా దివస్ సభకు మహిళలంతా అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
17వ వార్డు కౌన్సిలర్ గాదెపాక రవీందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మహిళలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు మహిళలంతా ఐక్యంగా సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ పాల్గొననున్న ఈ బహిరంగ సభకు మహిళలతోపాటు యువతీయువకులు, సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పెరుక భాగ్యరెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షుడు అన్వర్ పాషా, మాజీ కౌన్సిలర్ బొజు రమ రవీందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏడబోయిన రజిని, మాజీ ఎంపీపీ లకావత్ మానస, మాజీ జడ్పీటీసీ భూక్య మంగ, మహిళా నాయకులు బండి పుష్ప, చిదురాల అశ్విని, భారతమ్మ, అనురాధ, అంజలి, నాయకులు మిల్కూరి రవి, గడ్డం సదానందం తదితరులు పాల్గొన్నారు.

