కరీంనగర్ అక్టోబర్ 8 (చైతన్యగళం):
ప్రజావాణి, సీఎం ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, బర్త్ అండ్ డెత్ తదితర విభాగాల హెడ్ అధికారులు, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం ప్రజావాణితో పాటు ప్రజావాణి, ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ అధికారులు, సిబ్బంది, కార్మికుల బయోమెట్రిక్ హాజరు, వేతనాల చెల్లింపులు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజావాణి అర్జీల పెండింగ్ దరఖాస్తుల క్లియరెన్స్, బయోమెట్రిక్ హాజరు తదితర అంశాలపై సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇండోర్, ఔట్డోర్ ఉద్యోగులందరూ తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని, బయోమెట్రిక్ హాజరును ప్రాధాన్యతగా తీసుకుని వేతనాల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగుల వేతనాలు ఒకటో తేదీలోగా చెల్లించే విధంగా సూపరింటెండెంట్లు బాధ్యత వహించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు వేణు మాధవ్, ఖాదర్ మొహియుద్దీన్, అసిస్టెంట్ కమిషనర్ రాజమనోహర్, ఇన్చార్జ్ ఈఈ లచ్చిరెడ్డి, ఏసీపీ వేణు, సూపరింటెండెంట్లు, డీఈలు తదితరులు పాల్గొన్నారు.
