- హుస్నాబాద్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన.. మంత్రి పొన్నం ప్రభాకర్ బైఠాయింపు
హుస్నాబాద్, అక్టోబరు 7 (చైతన్యగళం): రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ‘ఇండియా’ కూటమి ఎంపీల అరెస్టులను నిరసిస్తూ హుస్నాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ బైఠాయించి నిరసన తెలిపారు.
ఓటరు సవరణ ప్రక్రియ పేరుతో ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారని, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ బీజేపీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ‘ఇండియా’ కూటమి సభ్యుల అరెస్టు అప్రజాస్వామికమని మంత్రి విమర్శించారు.
నిరసనలో మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, వివిధ మండలాల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
