- పేద రైతులు, ఇళ్ల స్థలాలకు నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం చూడాలి
హుస్నాబాద్, అక్టోబరు 6 (చైతన్యగళం): హుస్నాబాద్ మున్సిపల్ పట్టణ శివారులో 13-ఎల్ కాలువ నిర్మాణానికి భూముల సర్వే చేసేందుకు మంగళవారం ఇరిగేషన్ అధికారులు, తహసీల్దార్ రావడంతో బాధిత రైతులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. కాలువ పరిధిలో చిన్నచిన్న కమతాలు కలిగిన నిరుపేద రైతులు భూములతో పాటు ఇళ్ల స్థలాలు కోల్పోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో కాలువ తవ్వినా నీరు సక్రమంగా రాక పూడుకుపోయిన విషయాన్ని అధికారులు దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. ప్రస్తుత ప్రతిపాదనను రీడిజైన్ చేసి పేద రైతులు, నివాస స్థలాలకు నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. కాలువ నిర్మాణంతో చర్చి కూడా పూర్తిగా తొలగించే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
బాధిత రైతులు మరియాల రాజిరెడ్డి, కొరిమి పితాంబరం, జాల జ్యోతి కుమార్, జాల లక్ష్మయ్య, ఎస్.కోటేశ్వరరావు, బొజ్జ హరీష్, బొల్లి శ్రీనివాస్, గుర్రాల అరుణ, కూతాటి విజయభాస్కర్, ఇల్లందుల తిరుపతి, గొర్ల బాలయ్య, ఎం.కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
