Sunday, September 27, 2026
Homeతెలంగాణపర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

📰 Generate e-Paper Clip

  • జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రచారం కల్పించాలి: కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

మహబూబాబాద్‌, సెప్టెంబరు 26 (చైతన్యగళం): జిల్లాలోని ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి విస్తృత ప్రచారం కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం మహబూబాబాద్‌ మండలం కంబాలపల్లి పెద్ద చెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

కురవి వీరభద్రస్వామి, కందికొండ లక్ష్మీనరసింహస్వామి, నరసింహులపేట వెంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు బయ్యారం పెద్ద చెరువు, మత్తడి, భీమునిపాదం, గుంజేడు ముసలమ్మ తల్లి ఆలయం, ఏడు బావులు, కంబాలపల్లి పెద్ద చెరువు, గ్రీన్‌హిల్స్‌, పులిమడుగు, బయ్యారం జలపాతం తదితర ప్రాంతాలు జిల్లాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో సుమారు 49 శాతం అటవీ ప్రాంతం ఉందని, ప్రకృతి అందాలతో కూడిన అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని పేర్కొన్నారు.

పర్యాటక ప్రాంతాలకు ముద్రిత, ప్రసార, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి జిల్లా ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రించి, ప్రకృతికి విఘాతం కలగకుండా బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సహించాలని సూచించారు.

పాఠశాలల్లో ఏర్పాటు చేసిన యువ పర్యాటక సంఘాల ద్వారా విద్యార్థులకు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో భాగంగా పురాతన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్క నాటారు. విద్యార్థులు రూపొందించిన చిత్రాలు, ఛాయాచిత్రాల ప్రదర్శనను తిలకించారు. జిల్లా సంస్కృతి, పర్యాటక ప్రాంతాలపై పుస్తకం రూపొందించిన రమేష్‌ను అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పురుషోత్తం, అటవీ డివిజనల్‌ అధికారి వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుగులోతు జ్యోతి, మున్సిపల్‌ కమిషనర్‌ వినోద్‌కుమార్‌, అధికారులు, కళాకారులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!