- ప్రధాని మోదీకి ప్రజలు మద్దతుగా నిలవాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లబు వెంకటేశ్వర్లు
మహబూబాబాద్, సెప్టెంబరు 26 (చైతన్యగళం): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లబు వెంకటేశ్వర్లు కోరారు. మోదీ సేవలకు ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా అభియాన్‌లో భాగంగా శనివారం మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పట్టణ పార్టీ ఇన్‌చార్జి ఎల్ది మల్లయ్యగౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వల్లబు వెంకటేశ్వర్లు విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి ముల్లంగి ప్రతాప్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్‌నాయక్, కార్యదర్శి ఇందూభారతి, కౌన్సిలర్ శ్రీదేవి బాలునాయక్, పట్టణ ప్రధాన కార్యదర్శి ధరావత్ రవికుమార్, పట్టణ ఉపాధ్యక్షుడు రవియాదవ్, మల్లం యశ్వంత్, శైలజ తదితరులు పాల్గొన్నారు.
