కోహెడ, సెప్టెంబరు 22 (చైతన్యగళం): వినాయక నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలు, సోదరభావంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోహెడ ఎస్‌ఐ పి.అభిలాష్ సూచించారు. నిమజ్జన వేడుకల్లో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు, అధిక శబ్దంతో కూడిన ధ్వనివర్ధక పరికరాల వినియోగానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జన మార్గంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించి వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా పూర్తి చేయాలని ఎస్‌ఐ పి.అభిలాష్ కోరారు.
