Thursday, November 5, 2026
Homeతెలంగాణరూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

📰 Generate e-Paper Clip

ఆత్మహత్య కేసులో ఇరికిస్తానని బెదిరించి డబ్బుల డిమాండ్

ఆదిలాబాద్, నవంబర్ 04 (చైతన్యగలం):

లంచం తీసుకుంటూ ఓ పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న జి. రమేష్ రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కినట్లు అధికారులు వెల్లడించారు.

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లికాని యువతి ఆత్మహత్యకు సంబంధించిన కేసులో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 194 కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఫిర్యాదుదారుడిని నిందితుడిగా చేర్చకుండా ఉండటంతో పాటు, తన వద్ద ఉన్న ఫిర్యాదుదారుడి సెల్‌ఫోన్‌ను తిరిగి ఇచ్చేందుకు ఎస్సై రమేష్ లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తొలుత రూ.50 వేలు డిమాండ్ చేయగా, ఫిర్యాదుదారుడి విజ్ఞప్తి మేరకు రూ.40 వేలకు ఒప్పుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ఈ క్రమంలో బుధవారం ఏసీబీ అధికారులు నిర్వహించిన వలలో భాగంగా గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న పెట్రోల్ బంకు సమీపంలో ఎస్సై ఫిర్యాదుదారుడిని కలిశాడు. అక్కడ ఉన్న సెంట్రింగ్ బాక్సుల కింద రూ.40 వేల నగదును ఉంచాలని సూచించడంతో ఫిర్యాదుదారుడు ఆ మొత్తాన్ని అక్కడ పెట్టాడు. ఈ వ్యవహారంలో ఎస్సై తన అధికారిక హోదాను దుర్వినియోగం చేసి అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది.

ఎస్సై జి. రమేష్‌ను అరెస్టు చేసి కరీంనగర్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను వెల్లడించలేదు.

లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి

ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. వాట్సాప్ ద్వారా 9440446106 నంబర్‌కు కూడా సమాచారం అందించవచ్చని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!