- త్వరలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం.. ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: కాంగ్రెస్ నేతలు
దుబ్బాక, నవంబర్ 4 (చైతన్యగళం):
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ స్పష్టం చేశారు. దుబ్బాక పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరించిందని, దుబ్బాక మార్కెట్ యార్డులో సుమారు 30 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలోనే కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి, సకాలంలో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసే బాధ్యత తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. గతంలో తడిసిన ధాన్యాన్ని సైతం 24 గంటల్లో రైస్ మిల్లులకు తరలించి, రైతులకు చెల్లింపులు చేసినట్లు గుర్తుచేశారు.
బీఆర్ఎస్ నాయకులు ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారని విమర్శించారు. కరువు మండలంగా ప్రకటించాలన్న డిమాండ్‌పై స్పందిస్తూ, గతంలో కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్ ప్రాజెక్టుల ద్వారా దుబ్బాక ప్రాంతానికి సాగునీరు అందిస్తామని చెప్పిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కరువు పరిస్థితులపై మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో దుబ్బాక నియోజకవర్గంలోని 14 గ్రామాల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులపై కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎల్‌నినో ప్రభావంతో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గి నీటి కొరత ఏర్పడుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రోజుకు 12 గంటల విద్యుత్ సరఫరా చేస్తోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి రైతులను రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. రైతులు బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి ఆందోళన చెందవద్దని కోరారు.
గతంలో ఖమ్మం మిర్చి రైతులకు బేడీలు వేసిన ఘటనతో పాటు, మల్లన్నసాగర్ నిర్మాణ సమయంలో రైతులు ఎదుర్కొన్న పరిస్థితులను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ పాలనలో రైతులకు జరిగిన అన్యాయాలకు ఆ పార్టీ నాయకులే సమాధానం చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.
దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి శ్రీనివాస్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నవారు వాటిని ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే తాము కూడా ప్రత్యర్థుల అవినీతి వ్యవహారాలను బయటపెడతామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో చెరువుల ఆక్రమణలకు సంబంధించిన వార్తలు, కేసులపై ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచారంటూ ఎమ్మెల్యేపై విమర్శలు చేశారు. శ్రీనివాస్‌రెడ్డిపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ రైతులను తప్పుదోవ పట్టించవద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రైతుల సంక్షేమం కోసమే పనిచేస్తున్నారని, దుబ్బాక రైతులు వాస్తవాలను గమనించాలని కోరారు.
ఈ సమావేశంలో దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆకుల భరత్, మట్టా కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దుబ్బాక మున్సిపల్ అధ్యక్షుడు మల్లుగారి రాంచంద్రారెడ్డి, దుబ్బాక పీఏసీఎస్ డైరెక్టర్ గజాబింకర్ బాలరాజు, కాంగ్రెస్ నాయకులు శ్రీరాం నరేందర్, శ్రీధర్, ఇరేణి సాయితేజ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
