- అర్హులైన బాధితులకు ప్రభుత్వ సహాయం సకాలంలో అందించాలి.. అధికారులకు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశం
నాగర్‌కర్నూల్, అక్టోబర్ 28 (చైతన్యగళం):
నాగర్‌కర్నూల్ జిల్లాలో వెట్టిచాకిరీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వెట్టిచాకిరీకి గురవుతున్న కార్మికులను గుర్తించి, వారికి విముక్తి కల్పించడంతోపాటు ఆర్థిక సహాయం, పునరావాసం అందించి వారి హక్కులను పరిరక్షించాలని సూచించారు. ఈ దిశగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
బుధవారం నాగర్‌కర్నూల్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించి, జిల్లాలో వెట్టిచాకిరీ కార్మికుల గుర్తింపు, విముక్తి, ఆర్థిక సహాయం, పునరావాసం తదితర అంశాలపై సమీక్షించారు.
జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 161 మంది వెట్టిచాకిరీ కార్మికులను గుర్తించి విముక్తి కల్పించినట్లు జిల్లా కార్మిక శాఖ అధికారి రాజ్‌కుమార్ సమావేశంలో వెల్లడించారు. వీరిలో 71 మందికి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. మరో 26 మందికి తాత్కాలికంగా ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున ప్రాథమిక సహాయం అందించగా, వారికి మిగిలిన రూ.15 వేల చొప్పున చెల్లించాల్సి ఉందని వివరించారు. అదేవిధంగా మరో 64 మంది విముక్తి పొందిన కార్మికులకు ఆర్థిక సహాయం అందించాల్సి ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన బాధితులందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి, సహాయం అందించడంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. వెట్టిచాకిరీ నిర్మూలనకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
వెట్టిచాకిరీకి గురవుతున్న కార్మికులను గుర్తించి, వారిని దోపిడీ నుంచి విముక్తి కల్పించడంతోపాటు అవసరమైన చట్టపరమైన రక్షణ కల్పించాలని కలెక్టర్ సూచించారు. విముక్తి పొందిన కార్మికులు తిరిగి వెట్టిచాకిరీ బారిన పడకుండా జీవనోపాధి అవకాశాలు కల్పించాలని, పునరావాస పథకాల ద్వారా వారికి అందాల్సిన ప్రయోజనాలను సకాలంలో అందించాలని తెలిపారు. వెట్టిచాకిరీకి సంబంధించిన ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి, బాధితులకు ప్రభుత్వ సహాయంతోపాటు అవసరమైన న్యాయ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలనలో కార్మిక శాఖతోపాటు రెవెన్యూ, పోలీసు, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖలు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, బ్యాంకింగ్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. బాధితుల వివరాలను సమగ్రంగా సేకరించి, అర్హత మేరకు వారికి అందాల్సిన ప్రయోజనాలను నిర్ణీత సమయంలో అందించేందుకు కృషి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య, జిల్లా కార్మిక శాఖ అధికారి రాజ్‌కుమార్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి ఉమాపతి, ఆర్డీవోలు అర్చన జనార్దన్ రెడ్డి, బన్సీలాల్, కలెక్టరేట్ సి-సెక్షన్ సూపరింటెండెంట్ రవికుమార్, షీ టీం ఎస్సై విజయ, సీసీఎస్ సీఐ శంకర్‌తోపాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
