- ఉద్యోగుల పోరాటానికి బీఎస్పీ సంపూర్ణ మద్దతు
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 28 (చైతన్యగళం):
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, వారికి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిరిసిల్లలో ఆందోళన చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు బీఎస్పీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
సిరిసిల్లలో కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన శిబిరాన్ని బీఎస్పీ నాయకులు సందర్శించి, వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి మద్దతుగా, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని నినాదాలు చేశారు.
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, ఉద్యోగులకు, వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని బీఎస్పీ నాయకులు కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వారి పక్షాన నిలబడి మద్దతు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కొమ్మాట అశోక్, జిల్లా ఉపాధ్యక్షుడు మంచకట్ల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగపల్లి మహేష్, సిరిసిల్ల పట్టణ మహిళా నాయకురాలు బుర్ర మమత తదితరులు పాల్గొన్నారు.
