- డ్రగ్స్ నివారణకు శాఖల సమన్వయంతో పటిష్ట చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్, అక్టోబర్ 28 (చైతన్యగళం):
మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. పొగాకు, గుట్కా తదితర మత్తు పదార్థాల అలవాట్లకు దూరంగా ఉండాలని, యువత, విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు సమష్టిగా ముందుకు రావాలని సూచించారు. మాదకద్రవ్యాల నియంత్రణకు పోలీసు, విద్య, వైద్య, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ, ఓయూ జాతీయ సేవా పథకం విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’, ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్–2047’ అవగాహన కార్యక్రమానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో వర్చువల్ విధానంలో వీక్షించారు. ఇందులో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల జాతీయ సేవా పథకం విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.
వర్చువల్ కార్యక్రమం అనంతరం కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబానికి, సమాజానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. సరదాగా ప్రారంభమయ్యే మాదకద్రవ్యాల వినియోగం క్రమంగా అలవాటుగా మారి జీవితాలను అంధకారంలోకి నెడుతుందని హెచ్చరించారు. విద్యార్థులు, యువత ప్రవర్తనలో వచ్చే మార్పులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నిరంతరం గమనించాలని సూచించారు.
చాక్లెట్లు, ఇతర తినుబండారాలను కొనుగోలు చేసే సమయంలో విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. వాటి కవర్లు, ప్యాకెట్లపై ఉన్న వివరాలను పరిశీలించిన తర్వాతే వినియోగించాలని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అన్ని విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కూడా నషా ముక్త్ భారత్ అభియాన్‌పై అవగాహన కల్పించాలని వైద్యాధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో టోల్‌ఫ్రీ నంబర్ 14445పై విస్తృత ప్రచారం చేపట్టాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ చిత్రా మిశ్రా వివిధ శాఖల అధికారులు, రెడ్‌క్రాస్ సభ్యులు, విద్యార్థులతో కలిసి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు.
అంతకుముందు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా శాఖ చైర్మన్ సంగేం లక్ష్మణరావు, మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో మాదకద్రవ్య రహిత భారతదేశంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. గీతాభవన్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ కలెక్టరేట్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ, ఉద్యోగుల జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజ్‌గోపాల్‌రావు, వివిధ కళాశాలల విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, ఉద్యోగ సంఘాల నాయకులు, రెడ్‌క్రాస్ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ కార్యదర్శి ఊటుకూరి రాధాకృష్ణారెడ్డి, కనపర్తి మనోహర్‌రావు, మేనేజింగ్ కమిటీ సభ్యులు పెండ్యాల కేశవరెడ్డి, కుందారపు మహేశ్వర్, కోల అన్నారెడ్డి, శ్రీహరిరెడ్డి, రాగి శ్రీనివాస్, చిదుర సురేష్, రాజిరెడ్డి, రాకేష్, పెద్ది విద్యాసాగర్, గోనే శ్రీనివాస్, ఎలగందుల మునీందర్, నరేందర్, టీజీవోల సంఘం జిల్లా కార్యదర్శి ఎడ్ల అరవింద్‌రెడ్డి, టీఎన్జీవోల రాష్ట్ర సంఘం నాయకులు సర్దార్ హర్మీందర్ సింగ్, గూడ ప్రభాకర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మారుపాక రాజేష్ భరద్వాజ్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోట రామస్వామి, కార్యదర్శి శంకర్, నాయకులు గంగారపు రమేష్‌గౌడ్, ఓంటేల ప్రసాద్‌రెడ్డి, మొహమ్మద్ అలీ, శంషుద్దీన్, కయ్యం శ్రీనివాస్, గుండా రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
