Thursday, October 29, 2026
Homeతెలంగాణకరీంనగర్ఎన్‌డీపీఎస్‌ కేసుల దర్యాప్తులో జాప్యం లేకుండా చర్యలు

ఎన్‌డీపీఎస్‌ కేసుల దర్యాప్తులో జాప్యం లేకుండా చర్యలు

📰 Generate e-Paper Clip

  • గంజాయి సరఫరాదారులపై ప్రత్యేక నిఘా పెట్టాలి: ఈగిల్‌ టీమ్‌ ఎస్పీ గిరిధర్‌
  • మాదకద్రవ్య రహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దుతాం: సీపీ గౌష్‌ ఆలం

కరీంనగర్‌, అక్టోబర్‌ 28 (చైతన్యగళం):

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నమోదైన ఎన్‌డీపీఎస్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని తెలంగాణ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ఈగిల్‌ టీమ్‌ ఎస్పీ గిరిధర్‌ అధికారులను ఆదేశించారు. గంజాయి సరఫరా చేసే ప్రధాన వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టి, వారి సరఫరా వ్యవస్థను ఛేదించాలని సూచించారు.

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఎన్‌డీపీఎస్‌ (నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌) కేసులపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఈగిల్‌ టీమ్‌ ఎస్పీ గిరిధర్‌, పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం ఐపీఎస్‌ ఆధ్వర్యంలో కమిషనరేట్‌ పోలీసు అధికారులు పెండింగ్‌ కేసుల పురోగతిని సమీక్షించారు. కేసులు దర్యాప్తులో పెండింగ్‌లో ఉండటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకుని, దర్యాప్తు అధికారులకు పలు సూచనలు చేశారు.

ఎన్‌డీపీఎస్‌ చట్టంపై దర్యాప్తు అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని గిరిధర్‌ సూచించారు. నిందితులపై సరైన ఆధారాలు సేకరించి, పకడ్బందీగా అభియోగపత్రాలు దాఖలు చేయాలని ఆదేశించారు. చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా కేసులను బలోపేతం చేయాలని, న్యాయస్థానాల్లో నేరం రుజువయ్యేలా దర్యాప్తు చేపట్టాలని పేర్కొన్నారు. నేరాల నిరూపణ, శిక్షల శాతం పెరిగినప్పుడే మాదకద్రవ్యాల నియంత్రణకు మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

యువత, విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. కమిషనరేట్‌ పరిధిలోని డీ-అడిక్షన్‌ కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, మాదకద్రవ్యాల వినియోగానికి అలవాటుపడిన వారికి అవసరమైన కౌన్సెలింగ్‌ అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం మాట్లాడుతూ.. కరీంనగర్‌ కమిషనరేట్‌ను మాదకద్రవ్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. మత్తు పదార్థాల విక్రయాలు, అక్రమ రవాణాపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు, వినియోగదారులకు కౌన్సెలింగ్‌ అందించడంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో కమిషనరేట్‌ ఏసీపీలు వెంకటస్వామి, విజయకుమార్‌, మాధవి, ఈగిల్‌ ఏసీపీలు ఉపేందర్‌, సోమనాథ్‌, పుష్పన్‌ కుమార్‌, సీఐలు, ఎస్‌ఐలు, దర్యాప్తు అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!