- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జిల్లా సాధన సమితి విజ్ఞప్తి
మిర్యాలగూడ, నవంబర్ 9 (చైతన్యగళం): మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతూ జిల్లా సాధన సమితి నాయకులు సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. ఆర్డీవో రమణారెడ్డితో పాటు మిర్యాలగూడ పట్టణ మున్సిపల్ చైర్మన్, డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణకు వినతిపత్రాలు అందజేశారు.
మిర్యాలగూడ ప్రాంతంలో అనేక పరిశ్రమలు, సిమెంట్ కర్మాగారాలు, సహజ వనరులు, రైస్ మిల్లులు ఉన్నాయని, సాగర్ ఎడమ కాలువకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతాన్ని గత పాలకులు జిల్లాగా ప్రకటించకుండా నిర్లక్ష్యం చేశారని జిల్లా సాధన సమితి నాయకులు పేర్కొన్నారు. సూర్యాపేటను జిల్లాగా ఏర్పాటు చేసినప్పటికీ, అన్ని వనరులు, అభివృద్ధికి అవకాశాలు ఉన్న మిర్యాలగూడను జిల్లాగా చేయకపోవడం అన్యాయమని వారు అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మిర్యాలగూడను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరారు. జిల్లా ఏర్పాటైతే ఈ ప్రాంతంలో వైద్య కళాశాల, ఇంజినీరింగ్ కళాశాలతో పాటు బీ-ఫార్మసీ, ఎం-ఫార్మసీ, డీ-ఫార్మసీ వంటి విద్యాసంస్థలు ఏర్పాటు కావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. తద్వారా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఈ అంశంపై సానుకూలంగా స్పందించి మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి కన్వీనర్, ఎంఐఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ ఫరూక్, బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్, బీసీ జేఏసీ పట్టణ కన్వీనర్, జిల్లా సాధన సమితి కన్వీనర్ వజ్రగిరి అంజయ్య, వైహెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు రజక ఎర్రబల్లి దుర్గయ్య, రజక బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, కిషన్ నాయక్ తదితర ఎస్టీ నాయకులు పాల్గొన్నారు.
