- నిధులు మంజూరైనా పెద్ద చెరువు పనులు ఎందుకు ప్రారంభించలేదు?
- ఓటుకు నోటు ఆరోపణలపై ప్రమాణానికి సిద్ధమా? ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డికి కాంగ్రెస్ నేతల సవాల్
దుబ్బాక, నవంబర్ 7 (చైతన్యగళం): దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వంపై నిరాధార విమర్శలు చేయడం మానుకుని, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ హితవు పలికారు. దుబ్బాకలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిత్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముత్యంరెడ్డి కుటుంబాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న ఎమ్మెల్యే.. దుబ్బాక అభివృద్ధికి ఇప్పటివరకు ఏం కృషి చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గత ఏడాది అమృత్ పథకం కింద దుబ్బాక పెద్ద చెరువు కట్ట సుందరీకరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.3.65 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నా పనులు ఎందుకు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. ఈ అంశంపై పత్రికల్లో కథనాలు వచ్చినప్పటికీ ఎమ్మెల్యే స్పందించకపోవడం శోచనీయమన్నారు. కాంట్రాక్టర్‌ను పిలిపించి మున్సిపాలిటీలో సమీక్ష నిర్వహించి పనులు ప్రారంభించకపోవడానికి కారణాలేమిటో తెలుసుకోవాలని సూచించారు. కాంట్రాక్టర్‌ను బెదిరిస్తున్నారనే ఆరోపణలపైనా ఎమ్మెల్యే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిధులు వెనక్కి వెళ్లినా ఫర్వాలేదు కానీ, దుబ్బాక అభివృద్ధి జరగకూడదనే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మైకులు పగలగొట్టడం, మంత్రుల కార్యక్రమాలను అడ్డుకోవడం, గేట్లు బద్దలు కొడతామంటూ వ్యాఖ్యలు చేయడం మానుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హితవు పలికారు.
దేవుడి సాక్షిగా నిరూపించుకుందాం..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుకు రూ.1,000 నుంచి రూ.2,000 వరకు పంపిణీ చేశారనే ఆరోపణలు నిజం కాకపోతే ఎమ్మెల్యే తన స్వగ్రామంలోని రాములవారి ఆలయంలో పసుపు నీళ్లతో స్నానం చేసి నిరూపించుకోవాలని మచ్చ శ్రీనివాస్ సవాల్ విసిరారు. తాను కూడా దుబ్బాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలోని భూ వివాదాలు, ఎన్‌వోసీల జారీ, అధికారులతో జరిగిన లావాదేవీల్లో ఎమ్మెల్యే అనుచరుల పాత్ర ఉందంటూ ఆరోపించారు. ఈ అంశాలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. దుబ్బాక అభివృద్ధి నిలిచిపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మల్లుగారి చంద్రారెడ్డి, 14వ వార్డు కౌన్సిలర్ తునికి సురేశ్, జిల్లా కార్యదర్శి సత్తు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఐరన్ సాయితేజ గౌడ్, ఒడిచర్ల వెంకటేశం, నక్క బాలవెంకన్న తదితరులు పాల్గొన్నారు.
