- అన్ని శాఖల సమన్వయంతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 28 (చైతన్యగళం):
జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. బుధవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఎస్పీ మహేష్ బి. గితేతో కలిసి ఆమె జిల్లాస్థాయి మాదకద్రవ్యాల నియంత్రణ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో నమోదవుతున్న ఎన్‌డీపీఎస్ కేసులు, గంజాయి సాగు నివారణకు తీసుకుంటున్న చర్యలు, శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, వ్యసన విముక్తి కేంద్రాల్లో అందిస్తున్న వైద్య సేవలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నియంత్రణకు సమావేశంలో పాల్గొన్న ప్రతి శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి సమర్థంగా అమలు చేయాలని సూచించారు. పోలీసు, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. దుకాణాల్లో ఆహార భద్రతాధికారులు తనిఖీలు చేపట్టాలని సూచించారు. మాదకద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి, వారికి అవసరమైన వైద్య చికిత్సతోపాటు కౌన్సెలింగ్ అందించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. అటవీ, వ్యవసాయ శాఖల అధికారులు తమ పరిధిలోని అటవీ భూములను పరిశీలించాలని, ఎక్కడైనా గంజాయి సాగు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు.
విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వైద్య ఆరోగ్య, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలోని 10 డిగ్రీ కళాశాలలు, 20 జూనియర్ కళాశాలల్లో సుమారు 2,600 మంది విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులతో కమిటీలు ఏర్పాటు చేసి, ప్రతిరోజూ ప్రార్థనా సమయంలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.
ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ జిల్లాలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంతోపాటు, వాటి వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.
ఈ సమావేశంలో ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కె.ఎస్.బి. కుమారి, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా విద్యాధికారి విజయ్‌సాగర్, ఇంటర్మీడియట్ విద్యాధికారి శరత్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్, జిల్లా ఎక్సైజ్ అధికారి హిమశ్రీ, ఆహార భద్రతాధికారి అనూషతోపాటు వ్యవసాయ, కార్మిక, అటవీ శాఖల అధికారులు పాల్గొన్నారు.

