- ప్రాణాలు కాపాడిన వారికి రూ.25 వేల ప్రోత్సాహకం.. పోలీసు అధికారులకు సీపీ గౌష్ ఆలం ఆదేశాలు
కరీంనగర్, అక్టోబర్ 27 (చైతన్యగళం):
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సత్వర వైద్యం అందేలా చర్యలు తీసుకోవడంతోపాటు, ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, రహదారి భద్రతా పథకాలు, నూతన నేర చట్టాల అమలు, కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్షించారు.
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర వైద్యం అందించేందుకు ఉద్దేశించిన పీఎం రాహత్ పథకంపై అధికారులకు వివరించారు. ఈ పథకం కింద అర్హులైన బాధితులకు గరిష్ఠంగా ఏడు రోజులపాటు లేదా రూ.1.50 లక్షల వరకు నగదు రహిత అత్యవసర వైద్య చికిత్స అందించే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాద బాధితులకు సకాలంలో చికిత్స అందేలా స్థానిక ఆసుపత్రులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
అలాగే, రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలించి ప్రాణాలు కాపాడే వారికి ప్రోత్సాహకాలు అందించే రాహ్‌వీర్ పథకంపై ప్రజలకు వివరించాలని ఆదేశించారు. ప్రమాద బాధితులకు సహాయం చేసే వ్యక్తులకు ప్రభుత్వం రూ.25 వేల నగదు ప్రోత్సాహకం అందిస్తుందని, నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఏడాదిలో గరిష్ఠంగా ఐదుసార్లు ఈ ప్రోత్సాహకానికి అర్హత పొందవచ్చని తెలిపారు. ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ప్రజలు ముందుకు వచ్చేలా పోలీసు సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
నూతన నేర చట్టాల అమలుపై సమీక్షిస్తూ కేసుల దర్యాప్తులో పారదర్శకత, వేగం పెంచాలని సీపీ స్పష్టం చేశారు. నేర ప్రదేశాల్లో సాక్ష్యాధారాల సేకరణ, సంబంధిత ఆడియో, వీడియో రికార్డుల నమోదు కోసం ఈ-సాక్ష్య విధానాన్ని నిబంధనల ప్రకారం సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. న్యాయస్థానాలకు సంబంధించిన సమన్ల జారీ ప్రక్రియలో ఈ-సమన్ల విధానాన్ని పకడ్బందీగా వినియోగించాలని ఆదేశించారు.
కేసుల స్వభావం, వర్తించే చట్ట నిబంధనలను అనుసరించి నిర్దేశిత గడువులోగా ఛార్జ్‌షీట్లు దాఖలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. సంబంధిత కేసుల్లో వర్తించే కాలపరిమితికి అనుగుణంగా 60 లేదా 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్‌షీట్లు దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని, నేరాలకు పాల్పడిన వారికి చట్టప్రకారం శిక్ష పడేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏసీపీలు శ్రీనివాస్, శ్రీనివాస్ జి., వెంకటస్వామి, విజయకుమార్, స్వామితోపాటు సీఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

