- ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.. రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేత
నాగర్‌కర్నూల్, అక్టోబర్ 27 (చైతన్యగళం): న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట గత 15 రోజులుగా సమ్మె చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) సంఘీభావం తెలిపింది. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పార్టీ తరఫున రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసింది.
ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్, నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు బోనాసి రాంచందర్, న్యాయవాది, బిజినపల్లి మండల అధ్యక్షుడు పానుగంటి రాంచందర్, బీఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధులు వైద్య వృత్తి నేపథ్యం ఉన్నవారేనని గుర్తుచేశారు. నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి చొరవ తీసుకుని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. సమన్వయంతో కృషి చేసి ఉద్యోగ భద్రత, వేతనాలు, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు క్రమబద్ధమైన ఉద్యోగులుగా పనిచేస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. అలాంటప్పుడు తెలంగాణలో పనిచేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు కల్పించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నెలకు కేవలం రూ.7 వేల వేతనంతో ఉద్యోగులతో పనిచేయించుకోవడం అన్యాయమని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. సుప్రీంకోర్టు వెలువరించిన ఈ సూత్రానికి అనుగుణంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, అయితే ఆచరణలో అది అమలుకు నోచుకోవడం లేదని అన్నారు.
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు మహిళా ఉద్యోగులకు చట్టబద్ధమైన సెలవులు మంజూరు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి బాధ్యత తీసుకోవాలని కోరారు. ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి బీఎస్పీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ అసెంబ్లీ నాయకుడు కాకునూరి మధు తదితరులు పాల్గొన్నారు.
