- జాతీయ స్థాయిలో రాణించేందుకు మల్‌రెడ్డి స్నేహ–అభిషేక్‌రెడ్డి ఆర్థిక ప్రోత్సాహం
ఆరుట్ల(చైతన్యగళం): త్రోబాల్ క్రీడలో ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఆరుట్ల విద్యార్థిని బండ మౌనికకు మల్‌రెడ్డి యువశక్తి కన్వీనర్ మల్‌రెడ్డి స్నేహ–అభిషేక్‌రెడ్డి ఆర్థిక ప్రోత్సాహం అందించారు. కోల్‌కతాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు మౌనిక ఎంపికైన విషయం తెలుసుకున్న వారు ఆమెను అభినందించి, పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక సహాయం అందజేశారు. మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల చేతుల మీదుగా ఈ సహాయాన్ని మౌనికకు అందించారు.
ఆరుట్ల గ్రామానికి చెందిన బండ చంద్రయ్య, పద్మ దంపతుల కుమార్తె మౌనిక ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. గత సెప్టెంబర్ 27న నిర్వహించిన రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది.
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని మల్‌రెడ్డి స్నేహ–అభిషేక్‌రెడ్డి తెలిపారు. మౌనిక జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటి, భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించాలని మల్‌రెడ్డి యువశక్తి ఆకాంక్షించింది.
